ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కీర్తిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని వై.రామవరంలో చోటు చేసుకుంది. జిల్లాలోని మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ఏమని రాసి ఉందంటే.. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల చీకటి జీవితాలకు వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రివర్యులు’ అంటూ కేసీఆర్ కు ‘శతకోటి అభివందనములు’ అని కేసీఆర్‌ను కీర్తిస్తూ ఈ ఫ్లెక్సీలో రాశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఫ్లెక్సీలతో భాగ్యనగర్‌ను పింక్ సిటీగా మార్చేసిందని మీడియా ఇటీవల ఆసక్తికర కథనాలు రాసింది. అంతకంటే ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలోని ఫ్లెక్సీనే హాట్ టాపిక్ అయింది.
‘కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత పాలకులకు కనువిప్పు కలిగేలా ఉద్యోగులందరినీ దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలు ఏపీ సీఎం చంద్రబాబును అవమానించినట్లుగానే ఉన్నాయని వాటిని తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినట్లుగా సమాచారం .
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో సీఎం కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలను తెలుగు తమ్ముళ్లే ఏర్పాటు చేశారని..అయితే ఇప్పుడు తమ సోదర ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ను కీర్తిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేస్తే తప్పేంటని ఆ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.తమ పార్టీని ఏపీకి విస్తరించాలన్నఆలోచనలో ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యానించిన పక్కరోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం విశేషంగానే చెప్పుకోవాలి.
please share it..
No comments:
Post a Comment